
ఖమ్మం, 3 డిసెంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో అత్యధికంగా రూ.8 లక్షలు పలికిన అభ్యర్థికి సర్పంచ్ పీఠం ఏకగ్రీవంగా దక్కేలా ఒప్పందం కుదిరింది.
గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే శ్రీరాముల వారి ఆలయ నిర్మాణం, ఇతర గ్రామాభివృద్ధి పనుల నిమిత్తం నిధులు సేకరించాలని నిర్ణయించారు. దీంతో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసి ఆ పదవిని దక్కించుకునే అభ్యర్థి గ్రామాభివృద్ధికి భారీ విరాళం ఇవ్వాలని బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో అత్యధికంగా రూ.8 లక్షలు చెల్లించడానికి కొలికపొంగు ఉప్పలమ్మ అనే అభ్యర్థి ముందుకు వచ్చారు. దీనితో నామినేషన్లు వేసిన మొత్తం ఎనిమిది మందిలో ఏడుగురు ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదిరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు