
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)
గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని.. ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం చమత్కరించారు. పామాయిల్ పంటను ఎన్టీఆర్ హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మలేషియా నుంచి పామాయిల్ మొక్కను ఏపీకి తీసుకొచ్చామన్నారు. అక్కడ వర్షపాతం ఎక్కువ కావడం వల్ల ఆ ప్రాంతానికి అనుగుణంగా పామాయిల్ పంటలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ నీటి కొరత ఇబ్బంది ఉందన్నారు. తన లక్ష్యంగా జీరోనెట్ వ్యవసాయమని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఏ ఒక్క ఉత్పత్తి వ్యర్థం కావొద్దనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. అందుకోసం సమగ్ర ప్రణాళిక అవసరం అవుతుందన్నారు.
వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం పంట విస్తీర్ణంతో పాటు వేసిన పంటల గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అందుకు రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను రైతుల నుంచి ఆధునిక సాంకేతిత పట్ల శ్రద్ధను పెంచుకోవడం ఆశిస్తున్నానని తెలియజేశారు. తద్వారా ప్రణాళికబద్ధమైన విధానాల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV