
నెల్లూరు 3 డిసెంబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, బాపట్లలో భారీ వర్షాలు (Rains) బీభత్సం సృష్టించాయి.
నెల్లూరు నగరంలో (Nellore City) రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ముఖ్యంగా నగరంలో తరచుగా నీరు నిలిచిపోయే ప్రాంతమైన మాగుంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీనికి తోడు వైఎస్ఆర్ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు అర్ధరాత్రి ఇబ్బందులకు గురయ్యారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో ఈ సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం ప్రభావం నెల్లూరుతో పాటు బాపట్ల జిల్లాపై కూడా తీవ్రంగా పడింది. బాపట్ల జిల్లాలోని (Bapatla District) కొల్లూరు, వేమూరు మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. అయితే ఇది రైతులకు కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉండటం వలన రైతులు ధాన్యాన్ని రోడ్ల పక్కన, కళ్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. అకాలంగా కురిసిన ఈ భారీ వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాశులు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని, తద్వారా నాణ్యత తగ్గి ధర పడిపోతుందని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడం, ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తమ శ్రమ అంతా వృధా అయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV