
చిత్తూరు, 3 డిసెంబర్ (హి.స.)చిత్తూరు (Chittoor) జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు అసాధారణ రీతిలో పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. గత ఏడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతుండగా, ఇప్పటివరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలుస్తోంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్ర్కబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంటువ్యాధి కాకపోయినప్పటికీ ప్రాణాంతకంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV