
శ్రీశైలం, 3 డిసెంబర్ (హి.స.)
శివస్వాముల తాకిడితో శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రం కిటకిటలాడుతోంది. తెలుగురాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా శివమాల ధరించిన భక్తులు దీక్ష విరమణ కోసం శ్రీశైలానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. కార్తీక మాసమంతటా కఠిన దీక్షతో, నియమాలను పాటించిన శివస్వాములు (Shiva Swamulu) స్వామివారికి ముడుపును చెల్లించుకునేందుకు క్యూకట్టారు. ఈ క్రమంలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది శివస్వాములు భారీగా తరలిరాగా.. దేవాలయ పరిసరాలంతా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి.
కార్తీక మాసంలో మండల దీక్షలు (41 రోజులు) లేదా అర్ధ మండల దీక్షలు (21 రోజులు) స్వీకరించిన శివదీక్షా భక్తులు తమ దీక్షా విరమణ కోసం శ్రీశైలానికి చేరుకున్నారు. ఈ దీక్షా విరమణ కార్యక్రమంలో జ్యోతిర్ముడి సమర్పణ ప్రధానమైన ఘట్టంగా దీక్షాపరులు పేర్కొంటున్నారు. శివదీక్షను పూర్తిచేసుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో తెచ్చుకున్న ఈ జ్యోతిర్ముడిని హోమగుండంలో సమర్పించి దీక్షను విరమిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV