
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)దివ్యాంగులైన (Specially Abled) విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ మొదటి నుంచి అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి తన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో వారు ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శారీరక వైరుధ్యాలు కలిగినప్పటికీ.. దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులుగా నెగ్గుతున్నారని పేర్కొన్నారు. అటువంటి వారికి టీడీపీ మొదటి నుంచి బాసటగా నిలుస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో దివ్యాంగులకు మంచి రోజులు వచ్చాయన్నారు. మంచి ప్రభుత్వంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారికి రూ.6వేల పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా దివ్యాంగులకు అన్ని విధాల చేయూతను అందిస్తామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దివ్యాంగులు సవాళ్లను అధిగమించి జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV