
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు
సిద్ధమవుతున్న వేళ.. పోలీస్ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై వాహనాల రాకపోకలను ముఖ్యంగా వేడుకలకు నియంత్రించనున్నారు. వేదికయ్యే ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్ పరిసర ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలకు 'నో ఎంట్రీ' ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట, టోలీచౌకి మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు నగరంలోకి ప్రవేశం నిలిపివేయబడింది.
విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పీవీ ఎక్స్ప్రెస్ వే పై ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అయితే, చెల్లుబాటు అయ్యే ఫ్లైట్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల పేరుతో అతి వేగంగా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కాగా ఈ రోజు సాయంత్రం నుంచే.. నగర వ్యాప్తంగా వందలాది చోట్ల స్పెషల్ టీమ్స్ తనిఖీలు నిర్వహించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..