
విశాఖపట్నం, 4 డిసెంబర్ (హి.స.)విశాఖపట్నంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘మహా సాగర్’ పేరుతో భారీఎత్తున నేవీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వెల్లడించారు. నేవీ డేను పురస్కరించుకొని ఐఎన్‌ఎస్ హిమగిరి యుద్ధనౌకపై బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వీటిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రిప్యూ(ఐఎఫ్ఆర్), ఎక్సర్‌సైజ్ మిలాన్-2026, ది ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం(ఐఓఎన్‌ఎస్) ఉన్నాయని వివరించారు. ఐఎ్‌ఫఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మిలాన్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారన్నారు. మిలాన్‌కు 100కుపైగా దేశాలను ఆహ్వానించగా, 61 దేశాలు సానుకూలంగా స్పందించాయని తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు మిలాన్ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరిలో భారీగా కార్యక్రమాలు ఉన్నందున ఏటా డిసెంబరు 4న విశాఖలో నిర్వహించే సాహస విన్యాసాలను ఈ ఏడాది ప్రదర్శించడం లేదన్నారు. నేవీ డే కార్యక్రమాలను ఈసారి కేరళలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకాదళం తన సామర్థ్యాలను పెంచుకోవడానికి మరో 51యుద్ధనౌకలను నిర్మిస్తున్నదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ