
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)
తాడేపల్లి, మంగళగిరి, చినకాకానిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఫోర్జరీ సంతకాలు, వంద రూపాయల స్టాంప్ పేపర్లపై ఫోర్జరీ సంతకాలతో నకిలీ అగ్రిమెంట్ పత్రాలను సృష్టించి విక్రయానికి ప్రయత్నించిన వ్యక్తిని మంగళగిరి గ్రామీణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు పెదవడ్లపూడికి చెందిన రౌడీషీటర్ షేక్ జలీల్ చినకాకానిలోని 12 మంది రైతులకు చెందిన 10.25 ఎకరాలు భూమిని విక్రయించేందుకు కొంత మంది వ్యక్తులతో రూ.14 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. రూ.70లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆరుగురు రైతుల వద్ద భూములను కొనుగోలు చేసినట్లు వారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్లు తయారు చేశాడు. మరో ఆరుగురు రైతులకు చెందిన అగ్రిమెంట్లపై సంతకాలు లేవు. నాలుగు రోజుల క్రితం విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు భూమిని చదును చేస్తుండగా గమనించిన రైతులు అడ్డుకున్నారు. జలీల్ అనే వ్యక్తి వద్ద భూములు కొనుగోలు చేసేందుకు ఒప్పదం చేసుకున్నానని, కొలతలు వేసేందుకు చదును చేస్తున్నట్లు ఆయన చెప్పడంతో నిర్ఘాంతపోయిన రైతులు.. తమ భూములను ఎవరికీ అమ్మలేదని స్పష్టం చేశారు. రైతు సంఘం నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, అంకినీడు ప్రసాద్, సాంబశివరావు, శివన్నారాయణ, నరసింహారావులకు చెందిన సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఉంది. ఓ ఎమ్మెల్యేకు 45 సెంట్లు భూమి ఉన్నట్లు తెలిసింది. 2012లో ఆయన ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. నిందితుడు జలీల్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. జలీల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ