
న్యూఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.)
బాబ్రీ మసీదును పశ్చిమ బెంగాల్లోని
ముర్షిదాబాద్లో నిర్మిస్తామని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు ప్రతిరూపం యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించిన తిరుగుబాటు టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తృణమూల్ కాంగ్రెస్ వేటు వేసింది. మత రాజకీయాలను తమ పార్టీ నమ్మదని పేర్కొంటూ టీఎంసీ ఆయనను సస్పెండ్ చేసింది. డిసెంబర్ 6న తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటానని ఈ ఎమ్మెల్యే గతంలో ప్రకటించారు.
అనంతరం పార్టీ అతనిపై సస్పెన్షన్పై హుమాయున్ కబీర్ తీవ్రంగా స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో నేను డిసెంబర్ 6న శంకుస్థాపన చేస్తాను. ఇది నా వ్యక్తిగత విషయం, పార్టీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. 2015లో నన్ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సస్పెండ్ చేశారు. దాని గురించి నాకు చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాను, అని ఆయన స్పష్టం చేశారు. కొద్ది సేపటి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 22న తాను కొత్త పార్టీని ప్రకటిస్తానని సంచలన ప్రకటన చేశాడు. అలాగే తన కొత్త పార్టీ తరుఫున రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 135 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతానని ఆయన ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు