
నెల్లూరు, 4 డిసెంబర్ (హి.స.)
దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. మూడు రోజుల నుండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మొన్న రాత్రి నుండి వర్షం ఏకదాటిగా కురుస్తోంది. దీంతో నెల్లూరు నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది.
మాగుంట లేఔట్, పీఆర్సీ వద్ద అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు నిలిచిపోయింది. చెముడుగుంట లోతట్టు ప్రాంతం కావడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా విద్యుత్ కు సైతం అంతరాయం నెలకొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV