
పల్నాడు, 4 డిసెంబర్ (హి.స.)
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ నేడు(గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూ సమీకరణ పై రైతులతో మంత్రి నారాయణ సమావేశమై.. భూ సమీకరణ పై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ఉన్నారు.
అనంతరం మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ హయాంలో రైతులు నష్ట పోయారన్నారు. అమరావతిని ప్రపంచంలో టాప్ 5 లో ఒకటిగా ఉండేలా నిర్మించాలని సీఎం చంద్రబాబు తనకు ఆదేశాలిచ్చారని మంత్రి అన్నారు. మొదటి విడతలో కేవలం 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి సీఆర్డీఏకు ఇచ్చారన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపడితే గత 5 ఏళ్లలో నాటి ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టింది. గత ప్రభుత్వ నిర్వాకంతో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు.
గత ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ బిల్లులు చెల్లించి మళ్లీ రాజధాని పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న సమయానికి ఒక్కసారిగా వర్షాలు ముంచెత్తాయని మంత్రి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV