
విజయవాడ, 4 డిసెంబర్ (హి.స.)
ఏపీలోని విజయవాడ భవానీపురంలో భవానాల కూల్చివేతలపై ఏపీపీసీ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా విజయవాడ భవానిపురంలో 42 ఇండ్లను కనికరం లేకుండా కూల్చడం దారుణమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ తొందరపాటు చర్య అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 25 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న స్థానికులకు నిలువ నీడ లేకుండా చేశారు. ఉన్న పళంగా కట్టుబట్టలతో రోడ్డున పడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన వింటుంటే గుండె తరుక్కుపోతుంది.
ఎన్నికల్లో సమస్యను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేశారు. చివరికి సమస్య చెప్పుకునేందుకు వెళ్తే సీఎం చంద్రబాబు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయమని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో భవానిపురంలో ఇండ్లు కోల్పోయిన బాధితులను పిలిచి మాట్లాడండి. వారి వేదన వినండి. వారికి న్యాయం చేయండి. వివాదానికి పరిష్కారం చూపండి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV