
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
అధిక లాభాల పేరుతో నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా హీరా గ్రూప్ సీఈవో నౌ హిరా షేక్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సన్ సిటీ కి చెందిన మహ్మద్ సల్మా ఫాతిమా 2016లో హీరా గ్రూపులో రూ.40 లక్షలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 2018 నుంచి హీరా గ్రూప్ సంస్థ కమీషన్లు ఇవ్వడం ఆపేసింది. ఈ మేరకు తమను మాయమాటలు చెప్పి మోసం చేశారంటూ మహమ్మద్ సల్మా ఫాతిమా ఫిర్యాదు మేరకు నౌహీరా షేక్పై కేసు నమోదైంది.
కాగా, హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ కు చెందిన రూ.19.64 కోట్ల విలువైన స్థిరాస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నవంబర్ 21న వేలం వేసిన విషయం తెలిసిందే. 36 శాతం వడ్డీ పేరుతో అధిక లాభాల ఆశ చూపిన హీరా గ్రూప్.. గతంలో పెట్టుబడిదారుల నుంచి రూ.5,978 కోట్లు సేకరించింది. వేల కోట్లు వసూలు చేసి అసలు, వడ్డీ ఇవ్వకుండా మోసం చేసింది. ఈ క్రమంలోనే హీరా గ్రూప్కు చెందిన రూ.428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటివరకు రూ.93.63 కోట్ల విలువైన కంపెనీ ఆస్తులను వేలం వేసింది. వేలం ద్వారా సేకరించిన మొత్తాన్ని హీరా గ్రూప్ బాధితులకు అందజేస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు