
చిత్తూరు, 5 డిసెంబర్ (హి.స.)
చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై వరుసగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తిరుపతి నుంచి పళ్లిపట్టుకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా, అదే రోడ్డులో అంతకుముందే ఓ లారీ ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఆయిల్ ప్యాకెట్లతో కూడిన ఆ లారీలోని డ్రైవర్, క్లీనర్లను రక్షించేందుకు ప్రజలు అక్కడ గుమ్మిగూడారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించకుండా గ్రామస్తుల వైపు బస్సును దూసుకెళ్లినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన రామలింగం (65), గిరిబాబులను హుటాహుటిన కార్వేటినగరం ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించారు. అయితే ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులకు ఇబ్బంది తప్పలేదు. సీరియస్ పరిస్థితిలో ఉన్న రామలింగం అనే బాధితుడికి సరైన సమయానికి వైద్యం అందలేదు. ఎంతసేపటికి వైద్యులు రాకపోవడంతో చికిత్స అందక రామలింగం కన్నుమూశారు. మరొక తీవ్ర గాయాలైన వ్యక్తి గిరిబాబును మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ వ్యక్తి చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కార్వేటి ఆరోగ్య కేంద్రం వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV