
అమరావతి, 7 డిసెంబర్ (హి.స.)
గుంటూరు నగరంలోని ఆర్. అగ్రహారంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 655 ఏళ్ల చరిత్ర ఉంది. 12 మంది ఆళ్వారులు ఉండడంతో వైష్ణవ దివ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం ఉదయం ప్రాబోధిక గోష్ఠి, మధ్యాహ్నం మహా నివేదన, సాయంత్రం తీర్థ గోష్ఠితో త్రికాల అర్చనలు చేస్తుంటారు. ఏటా చైత్రమాసంలో 11 రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలు, గోదా కల్యాణం, పూజలు చేస్తుంటారు. 1370 సంవత్సరంలో వంగిపురం వెంకటాచార్యులు అనే భక్తుడికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి తాను కొండవీటి కొండల్లోని వాల్మీకంలో ఉన్నానని, అక్కడి నుంచి తీసుకొచ్చి ఆర్. అగ్రహారంలో ప్రతిష్ఠించాలని చెప్పినట్టు కథనం ప్రచారంలో ఉంది. ఆయన మరికొందరు భక్తులతో కలిసి కొండవీటి కొండల్లో వెతకగా స్వామి విగ్రహం కనిపించింది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆర్. అగ్రహారంలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. 70 అడుగుల గాలి గోపురం నిర్మించారు. జిల్లాలో ఆళ్వారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయాల్లో ఇది రెండోది. మొదటిది మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అప్పట్లో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన జమీందార్లతోపాటు పలువురు దాతలు దేవస్థాన నిర్వహణకు 198 ఎకరాలను దానంగా ఇచ్చారని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ