
హుజురాబాద్, 7 డిసెంబర్ (హి.స.) తెలంగాణకు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇది మూడేళ్లలో మనం చూస్తామని అన్నారు. హుజురాబాద్ లో ఆదివారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ది మోసపూరిత చరిత్ర అని ఆరోపించారు. కేసీఆర్నే వెన్నుపోటు పొడవాలని చూశాడని మండిపడ్డారు. చివరకు హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి.. గజ్వేల్కు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా జనం ఛీ కొడితే.. అక్కడి నుంచి మల్కాజిగిరి వెళ్లారని విమర్శించారు. ఇప్పుడు ఎక్కడా దిక్కులేక మళ్లీ కమలాపూర్ వస్తానంటున్నారు.. ఈటల రాజేందర్ లాంటి అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు. ఇలాంటి నేతలను అస్సలు నమ్మొద్దని హితవు పలికారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు