
కామారెడ్డి, 7 డిసెంబర్ (హి.స.)
సరదా కోసం తోటి స్నేహితులతో
కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇంటర్మీడియట్ విద్యార్థి కానరాని లోకాలకు వెళ్ళాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బిచ్కుంద మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన గొట్టం బాలయ్య, మల్లవ్వ దంపతుల కుమారుడు గొట్టం అజయ్ (17) అనే విద్యార్థి అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం కావడంతో ఉదయం పూట కళాశాల హాస్టల్లో అల్పాహారం భుజించిన అనంతరం ఐదుగురు తోటి విద్యార్థులతో కలిసి ప్రాజెక్టు 16 వరద గేట్ల దిగువ భాగాన మంజీరా నదిలో కలిసే నీటి కొలనులో ఈత కోసం వెళ్లినట్లు తెలిసింది. ప్రమాదవశాత్తు గొట్టం అజయ్ నీళ్లలో మునిగి మృతి చెందడంతో భయాందోళవన గురైన తోటి విద్యార్థులు కళాశాల ఉపాధ్యాయులకు, అజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపడుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు