
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆదివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పొంగులేటి రెండేళ్ల పాలనపై స్పందించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని రెండేళ్ల కాలం తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం అన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు