
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్లోనే అరుదైన దొంగతనం కలకలం రేపింది. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోను పోయిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సిబ్బంది, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, రూ.1.75 లక్షల విలువైన ఖరీదైన ఫోన్ను రికవరీ చేసి, పీఎస్లోని లాకర్లో భద్రపరిచారు. అయితే, ఏకంగా పోలీసుల కళ్ల ముందే, లాకర్లో దాచిపెట్టిన ఆ ఖరీదైన ఫోన్ను పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ కొట్టేయడం ఉన్నతాధికారులను సైతం షాక్కు గురి చేసింది.
శ్రవణ్ కుమార్ ఆ ఖరీదైన ఫోన్పై కన్నేసి, చాకచక్యంగా దాన్ని చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఈ దొంగతనం వెనుక పోలీస్ డ్రైవర్ హస్తం ఉందని నిర్ధారించిన ఉన్నతాధికారులు, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపారు. చివరకు, దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో, డ్రైవర్ శ్రవణ్ కుమార్ను తక్షణమే రిమాండుకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..