
విశాఖపట్నం, 8 డిసెంబర్ (హి.స.)విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టు వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అయితే నిర్వాసిత మత్స్యకారులు తమకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.2 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోర్టు గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఏడాది క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం 499 మంది కార్మికులకు ఈ చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు వారికి ఎలాంటి చెల్లింపు చర్యలు చేపట్టక పోవడంతో ఆగ్రహం చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం మెరుపు ధర్నాకు దిగారు.
ఉదయమే భారీగా పోర్టు గేటు వద్దకు చేరుకొని, గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తీవ్రం అవుతున్న నేపథ్యంలో స్పందించిన యాజమాన్యం కార్మిక నాయకులను చర్చలకు పిలిచి సమావేశం నిర్వహిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV