
నరసాపురం, 8 డిసెంబర్ (హి.స.)డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సఖినేటిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య వశిష్ఠ గోదావరిలో 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు నది మధ్యలో ఆగిపోయింది. ప్రవాహ వేగానికి సాగర సంగమం వైపు కొట్టుకుపోతుండగా, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వివరాల్లోకి వెళితే.. నరసాపురం నుంచి సఖినేటిపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన పంటు, నది మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆగిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అదే సమయంలో నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పంటు అదుపుతప్పి అంతర్వేది సాగర సంగమం వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV