అమరావతి, 28 జూలై (హి.స.)
:నాలెడ్జ్ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. ఇవాళ(సోమవారం జులై 28) సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటించారు. సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్‌తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని స్పష్టం చేశారు. సింగపూర్‌పై అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో.. సింగపూర్ టౌన్‌షిప్ నిర్మించామని తెలిపారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. సింగపూర్‌ను చూసే హైదరాబాద్‌లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ