హైదరాబాద్, 28 జూలై (హి.స.)
ఖమ్మం జిల్లాలో టెంపుల్ టూరిజంలను అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్రెడ్డిలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరితహోటల్, కనిగిరిహిల్స్, వైరా రిజర్వాయర్, వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో టూరిజం డెవలప్మెంట్కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రులు తెలిపారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధి పరచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని మంత్రులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్