తెలంగాణ, సంగారెడ్డి. 28 జూలై (హి.స.)
సిగాచీ పరిశ్రమలో పేలుళ్లు సంభవించి 54 మంది మరణించారని, ఈ దుర్ఘటన జరిగి నెలరోజులైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి ఆయన సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ను కలిసి.. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందించడంలో, పరిహారం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీశారు.
ఆ తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. 'సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెలమాసికాలు చేసుకుంటున్నారు. ఘటన జరిగినప్పుడు సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇప్పటికి నెల రోజులు అయ్యింది. ఒక్కరికి కూడా ఎక్స్రేషియా అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి ఉంది. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో, మన రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రమాద ఘటన ఎన్నడూ జరగలేదు. 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ఎస్ఎల్బీసీ ఘటనలో శవాలు కూడా దొరకలేదు, మీకు బూడిదైనా దొరికిందని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని బాధితులు చెబుతున్నారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు