అమరావతి, 29 జూలై (హి.స.), : పీఎం కిసాన్ 20వ విడత వాయిదా సొమ్ము ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ.5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మందికి కేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ