హైదరాబాద్, 29 జూలై (హి.స.)
కూతురును స్కూల్ బస్సు వద్ద దింపి, స్కూటీ పై ఇంటికి వస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త, కూతురితో కలిసి మణికొండలో నివాసం ఉంటున్న ఐ. షాలిని (30) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం తన కూతురిని స్కూల్ బస్సు వద్ద దింపి వస్తున్న సమయంలో మణికొండ సుందర్ గార్డెన్ వద్ద షాలిని నడుపుతున్న స్కూటీని ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో తీవ్ర రక్తస్రావంతో షాలిని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్