సింగపూర్, 29 జూలై (హి.స.)సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా.. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలోని మానవ వనరులు, శాస్త్రసాంకేతిక మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంపై 'ఎక్స్' (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేసిన ఆయన ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాలు పెట్టుబడులకు అనుకూలమని టాన్సీ లెంగ్ పేర్కొన్నారు. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
అలాగే పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. మరోవైపు 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని గుర్తు చేశారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి