అమరావతి, 29 జూలై (హి.స.)ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీలను మరిచారని ఆరోపించారు. మంచి ప్రభుత్వాన్ని కోల్పోయామన్న భావన ప్రజల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ క్రమంలో బిర్యానీ లేదు.. ఉన్న పలావు కూడా పోయిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు కోసం వైసీపీ ఎల్లప్పుడు పనిచేస్తునే ఉంటుందని తెలిపారు.
ఈ తరుణంలో వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ఘ్యారిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా సీఎం చంద్రబాబుకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి కుటుంబానికి ఎంత బాకీ పడ్డాడో చెప్పాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు చెప్పారు. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే ఆ యాప్ లో నమోదు చేసుకోవచ్చు. పలాన వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పవచ్చు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం’’ అని మాజీ సీఎం జగన్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి