మహబూబాబాద్, 30 జూలై (హి.స.)
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రజల నుండి నిరసన తెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్లలో ఆయన పర్యటన సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యే కనకయ్యను స్థానికులు నిలదీశారు. వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని జనం వారిని డిమాండ్ చేశారు.
బుధవారం గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను స్థానికులు మున్నేరువాగుపై అడ్డుకుని, నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి అక్కడ్నుంచి ఎమ్మెల్యే కనకయ్య నిష్క్రమించారు. బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని గ్రామస్థులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్