విజయవాడ, 30 జూలై (హి.స.)ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తంను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కెసిరెడ్డి గ్యాంగ్‌లో వరుణ్ పురుషోత్తం కీలక వ్యక్తి.
ఆయనపై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో మద్యం కుంభకోణానికి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వాంగ్మూలం ఆధారంగా హైదరాబాద్ శివారులో పట్టుబడిన రూ. 11కోట్ల నగదును విజయవాడకు చేర్చారు. మరింత సమాచారం కోసం వరుణ్ పురుషోత్తంను సిట్ అధికారులు విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి