అమరావతి, 31 జూలై (హి.స.) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకవైపు అగ్ర నటుడిగా మూవీల్లో నటిస్తూనే, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో గిరిజనులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను పవన్ కల్యాణ్ సందర్శించిన సమయంలో అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు వారికి పంపిణీ చేసి తన మంచి మనసును చాటుకున్నారు.
తాజాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మొండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లోని 222 కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ పంపిన రగ్గులను అందుకున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి