తెలంగాణ, నాగర్ కర్నూల్. 11 ఆగస్టు (హి.స.)
ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి
సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగినా, లబ్దిదారులు ఇచ్చినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన పేదలకు ఇంటింటికీ వెళ్లి పరిశీలించి వారికి మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
ఆయా వార్డుల్లో తిరుగుతూ నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పై మంత్రి ఆరా తీశారు. ప్రతి వార్డు తిరుగుతూ లబ్ధిదారులతో మాట్లాడి భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ పేదలను కేసీఆర్ మోసం చేశాడని, మంత్రిగా నేను ఉన్నపుడు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోలేదని మంత్రి జూపల్లి విమర్శించారు. గుడిసెలలో ఉంటున్న పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు