హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరంలోని చందానగర్లో మంగళవారం ఉదయం కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం 'ఖజానా జ్యువెలర్స్'లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా.. కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొందరిపై దాడులకు సైతం పాల్పడ్డారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్పై కాల్పులు జరిపింది. షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టారు. స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా.. వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్కు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్