అమరావతి, 12 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నేడు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకారం.. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, శనివారం నాటికి తీరం దాటవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి సంబంధించి, రేపటి నుంచి శుక్రవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి నిన్న ఉదయం వరకు వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. నిన్న కూడా పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల సహా పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి