పులివెందుల, 12 ఆగస్టు (హి.స.) వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలోజడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ప్రారంభమైంది.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోనూ దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహించనున్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 10,600 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఆరు పంచాయతీల్లో దాదాపు 15 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నల్లపరెడ్డిపల్లె మేజర్ పంచాయతీలోనే దాదాపు 4 ,000 కు పైగా ఓటర్లు ఉండటం గమనార్హం. ఈ 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. అందుకే అక్కడ వెబ్ కాస్టింగ్‌తోపాటు సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చావోరేవుగా మారింది. ఇక్కడ టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీచేస్తుండగా.. వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందులలో నిన్నటిదాకా జగన్ కుటుంబం చెప్పిందే వేదం. వారు చెప్పినవారే ప్రజాప్రతినిధులు అన్నట్లుగా ఏకపక్షంగా జరిగేది. ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. పులివెందులలో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి ఓడించే స్థాయికి టీడీపీ మొట్టమొదటిసారి చేరింది. గెలుస్తామని వైసీపీ నేతలే ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. ఏ పరిస్థితుల్లోనూ గెలవాలని జగన్ బెంగళూరు నుంచే వ్యూహాలు రచిస్తూ.. అమలు బాధ్యత ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికు అప్పగించారు. జిల్లా పార్టీ నేతలతో పాటు అవినాశ్‌రెడ్డి తొలిసారి ఇంటింటికీ వెళ్లి ఓట్లడిగారు. ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఓటు రేటు అనూహ్యంగా రూ.5 వేలకు పెంచేశారు. మహిళా ఓటర్లకు సోమవారం సాయంత్రం కీలకమైన నల్లపురెడ్డిపల్లెలో డబ్బుతో పాటు చీరలు కూడా పంచారు. ఇరు పార్టీలూ కేవలం ఓట్ల కోసమే రూ.10 కోట్లకు పైగా వెచ్చించారని ప్రచారం జరుగుతోంది. ఒంటమిట్టలో నోటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారని అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి