హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పలు దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తన క్లౌడ్ విభాగంలో ఉన్నత స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తొలగింపులు చేపట్టినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. ఏఐకి పెద్ద పీట వేస్తూ.. 500 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్