న్యూఢిల్లీ: , 14 ఆగస్టు (హి.స.)
వీధి శునకాల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం (Supreme Court).. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జంతు సంతతి నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడం ఈ సమస్యకు దారితీసిందని పేర్కొంది. అంతకుముందు ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. దేశ రాజధాని దిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ (Stray dogs) తరలించాలనే సుప్రీం తీర్పును సమర్థించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, బాధితుల సంఖ్య భారీ ఉందన్నారు. మాంసాహారం తినేవారు కూడా జంతుప్రేమికులమని ప్రకటించుకుంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
‘‘ఏటా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు దాదాపు 10వేల కేసులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వందల సంఖ్యలో రేబిస్ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. జంతువులను ఎవరూ ద్వేషించరు. ఎంతో మంది చిన్నారులు వీటి దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. స్టెరిలైజేషన్ వల్ల రేబిస్‌ను అరికట్టలేము. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారు కూడా జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు’’ అని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ