దిల్లీ:15 ఆగస్టు (హి.స.)
రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడనుంది. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సాంకేతికత అభివృద్ధి విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తోందన్నారు. 2008 ముంబయి దాడులు సమీకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయన్నారు. దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా.. ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు. పదేళ్ల క్రితం రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై మన దేశం దృష్టిపెట్టిందని.. ఇప్పుడు దాని ఫలితాలను చూస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ