న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్ (India)పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌ల వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది (Trump Tariffs on India). ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్‌లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. దీనికి ముందే అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని న్యూదిల్లీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25 నుంచి 29 మధ్య భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, తాజాగా ఆ పర్యటనను వారు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలు గురించి తెలియలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ