న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని వెల్లడించారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలా కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్ స్టేషన్‌లోకి కూడా వరదనీరు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ