కర్నూలు, 17 ఆగస్టు (హి.స.)ప్రతిరోజు ఉదయం అరటిపండు తినడం కొందరికి ఒక అలవాటుగా ఉంటుంది. అయితే అరటిపండు నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? లేక రోజువారీ భోజనానికి బదులుగా తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందా? (Every Morning Eating Banana) ఈ చిన్నపాటి అలవాటు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండులో సహజమైన కార్బోహైడ్రేట్స్ తో పాటు బి-విటమిన్స్ (B6, B1) ఉంటాయి. ఇవి శక్తిని సమతుల్యంగా ఉంచుతాయి. పైగా ఇందులో ఉండే ఫైబర్ వల్ల చక్కెర తక్షణంగా శరీరంలోకి జీర్ణం కాకుండా నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో ఉదయం మొత్తం ఉత్సాహంగా అనిపిస్తుంది.
జీర్ణవ్యవస్థకు మిత్రుడు
ఒక అరటిపండు దాదాపు 3-5 గ్రాముల ఫైబర్ ఇస్తుంది. ఇది మీ తిండిని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కొద్దిగా పచ్చి అరటిపండ్లు తింటే అందులో ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్ మీ చక్కటి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో గుడ్ బ్యాక్టీరియాను పెంచి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు నయం చేస్తుంది. BRAT డైట్‌లో (Banana, Rice, Applesauce, Toast) అరటిపండు ఉండటం దీని ఔషధగుణాన్ని సూచిస్తుంది.
రక్తపోటు నియంత్రణ
ఒక్క అరటిపండులో దాదాపు 400 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సోడియంను తక్కువ చేయడంలో సహాయపడుతుంది. రక్తనాళాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే పొటాషియం వల్ల కండరాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా ఒక మంచి గిఫ్ట్ లాంటిది!
మూడ్ బాగుంటుందా..
అరటిపండులో ఉన్న B6 విటమిన్, ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మన శరీరంలో సెరోటోనిన్, డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మనసు హాయిగా ఉంటుంది. ఒత్తిడి తక్కువగా అనిపిస్తుంది. అందుకే అరటిపండును నేచురల్ మూడ్ బూస్టర్ అని కూడా పిలుస్తుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి