అమరావతి, 22 ఆగస్టు (హి.స.) మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ‘‘మెరిట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో ఉంచుతాం. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నాం.
అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా.. సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి, ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ