న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.) వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం అందించాలని, ఇందుకోసం అధికారులు ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటుచేయాలని వెల్లడించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో కుక్కలకు ఆహారం (Feeding of stray dogs) ఇవ్వకూడదని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణ లేకుండా ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు చెప్పింది. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ