చెన్నై: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. నగరంలో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే న్యాయవిభాగం కార్యదర్శి, ఎంపీ ఎన్‌ఆర్ ఇళంగో కుమార్తె రాఘవి వివాహ వేడుకల్లో ఆయన సతీమణి దుర్గాస్టాలిన్‌తో పాటు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రి సామినాథన్, ఎంపీ తిరుచ్చి శివా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం అతిక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదన్నారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలోని పాలకపక్షానికి సానుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ