అమరావతి, 22 ఆగస్టు (హి.స.) వైకాపా హయాం నాటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెలలోనే ఒకసారి నోటీసులు ఇచ్చినా ఆయన అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పుత్తూరులోని నారాయణస్వామి ఇంటికి వెళ్లిన అధికారులు.. విచారణకు రావాలని నోటీసులు అందించారు.
వైకాపా అధికారంలోకి రాగానే సొంత బ్రాండ్లను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా నూతన మద్యం పాలసీని తెరపైకి తెచ్చారు. అప్పుడు నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం ఆర్డర్స్ విధానాన్ని ఆన్‌లైన్ నుంచి మాన్యువల్‌కు మార్చడం, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మకాలు జరపడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో సిట్ లోతైన విచారణ జరుపుతోంది. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణస్వామి సంతకాలు చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. వైకాపా హయాంలో లిక్కర్ పాలసీలో మార్పులపై సిట్ ఆయన్ను ప్రశ్నించనుంది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు, నాటి నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఏంటనేది ఆరా తీయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ