శ్రీశైలం , 22 ఆగస్టు (హి.స.)శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే వాగ్వాదం, వారిపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలో తాజాగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీశాఖ ఉద్యోగి కరిముల్లాపై దాడి నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను ఏ2గా చూపారు.
అలాగే ప్రధాన నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రౌతు అశోక్ (ఏ1) అని పోలీసులు తేల్చారు. అశోక్ జనసేన నాయకుడైనా.. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటు ఆయన ఉన్నారని, ఉద్యోగులపై దాడిచేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో గురువారం అశోక్‌ను పిలిపించి పోలీసులు విచారణ చేశారు.
శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ వద్ద ఫారెస్ట్ సిబ్బంది వాహనాన్ని ఆపిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు.. తమపై దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది తెలిపింది. తమపై దాడి చేసిన తర్వాత శ్రీశైలంలోని గొట్టిపాటి నిలయం అతిథి గృహంలో బంధించినట్లు ఉద్యోగులు పోలీసులకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి