అమరావతి, 23 ఆగస్టు (హి.స.), : డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటీవల ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీచేయగా,ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం కల్పించినట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం... విద్యార్థి అడ్మిషన్ కోరుకున్న కళాశాలకు వెళ్లి.. కాలేజీ లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న కోర్సులను తనకు నచ్చినట్లుగా ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో కాలేజీకి వెళ్లి కూడా మాన్యువల్‌గా దరఖాస్తు సమర్పించవచ్చు. అయితే చివరిసారిగా వెళ్లిన కాలేజీనే తొలి ప్రాధాన్యత అవుతుంది. మొదటగా దరఖాస్తు చేసుకున్న కాలేజీ చివరి ఆప్షన్ అవుతుంది. అలాగే విద్యార్థులు మాన్యువల్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేయొచ్చు. అయితే కాలేజీలకు వెళ్లి చేసిన దరఖాస్తులే మొదటి ప్రాధాన్యత అవుతాయి. విద్యార్థి ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, తర్వాత ఆఫ్‌లైన్‌లో చేసినా.. తొలి ప్రాధాన్యత ఆఫ్‌లైన్ కాలేజీలే అవుతాయి.
మరోవైపు ఆఫ్‌లైన్ విధానంలో కాలేజీల్లో పెట్టుకున్న ఆప్షన్లను విద్యార్థులు మార్చుకొనేందుకు అవకాశం లేదు. సాధారణంగా డిగ్రీకి తొలుత ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత మార్చుకోవచ్చు. కానీ కొత్త విధానంలో అది కుదరదు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు రూపాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ విధానంలో పెట్టుకున్న ఆప్షన్లను మాత్రమే మార్చుకోగలరు. అయితే ఈ విధానంలో విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కాలేజీకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత దానిని మార్చుకోవడం సాధ్యం కాదు. పైగా ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఆఫ్‌లైన్ దరఖాస్తుకే తొలి ప్రాధాన్యత లభిస్తుంది. దీనివల్ల ఆఫ్‌లైన్ విధానం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేలా కనిపిస్తోంది. అలాగే ఒక కాలేజీకి వెళ్లి అక్కడి లాగిన్ నుంచి మరో కాలేజీకి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ