రాజమహేంద్రవరం, 23 ఆగస్టు (హి.స.)
: గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 13.3 అడుగులకు చేరింది. డెల్టా కాల్వలకు 12,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి సుమారు 12.13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా క్రమంగా వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 4,73,076 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,11,124 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,019 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్‌వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,19,790 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.80 అడుగుల నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 197.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ