అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు... రంగంలోకి దిగిన సీబీఐ
ముంబై, 23 ఆగస్టు (హి.స.)ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్న కొన్ని రోజులకే, ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. రిలయన్స్ కమ్యూనికేష
అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు... రంగంలోకి దిగిన సీబీఐ


ముంబై, 23 ఆగస్టు (హి.స.)ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్న కొన్ని రోజులకే, ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), దాని ప్రమోటర్‌కు సంబంధించిన కార్యాలయాలపై శనివారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు సుమారు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ రుణ మోసం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం, జూన్ 13నే ఆర్‌కామ్, అనిల్ అంబానీ ఖాతాలను ఎస్బీఐ 'ఫ్రాడ్'గా వర్గీకరించింది. తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశారని, నిధులను పలు గ్రూప్ కంపెనీలకు అక్రమంగా మళ్లించారని బ్యాంకు గుర్తించింది. తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఆర్‌కామ్ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఒక ఖాతాను ఫ్రాడ్‌గా గుర్తించిన 21 రోజుల్లోగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితమే అనిల్ అంబానీని ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించారు. సుమారు రూ. 17,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని, అన్ని ఆర్థిక నిర్ణయాలు కంపెనీ బోర్డు తీసుకుందని, తాను కేవలం సంతకాలు మాత్రమే చేశానని అంబానీ చెప్పినట్లు సమాచారం. ఈడీ దాడుల్లో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా దాడులు చేయడంతో అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande